మరుగుదొడ్ల పేరుతో రూ.కోట్లు తినేశారు

Zilla Parishad Charman Bommi Reddy Raghavendra Reddy

మరుగుదొడ్ల పేరుతో రూ.కోట్లు తినేశారు
విచారణకు జడ్పీ ఛెర్మన్‌ డిమాండ్‌

జిల్లాలో పలు కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయని, తాజాగా మరుగుదొడ్ల నిర్మాణం పేరుతో రూ.కోట్లు తినేశారని వీటిపై జడ్పీ తరుఫున విజిలెన్సు విచారణకు సిఫారసు చేస్తున్నామని జిల్లా పరిషత్‌ ఛెర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తెలిపారు.ఆయన బుధవారం తన ఛాంబర్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. మరుగుదొడ్ల నిర్మాణంలో 100 శాతం పూర్తి చేసుకొని ఓడిఎఫ్‌ జిల్లాగా ప్రకటించడంతో తాము ఎంతో సంతోషపడ్డామని తెలిపారు. ఇందుకు జడ్పీ తరుఫున జిల్లా కలెక్టర్‌ను సన్మానించాలని భావించామన్నారు. ఇందుకు కలెక్టర్‌ను ఆహ్వానిస్తే.. ఇప్పుడు వద్దని ఇంకా మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమం పూర్తి కావాల్సి ఉందన్నారు.కొద్దిరోజులు గడిచిన తరువాత సైదాపురం,ఉదయగిరి ,రాపూరు మండలాల్లోని కొన్ని కాలనీల్లో అసలు మరుగు దొడ్లు నిర్మించ లేదని స్వయంగా లబ్ధిదారులే వచ్చి చెబితే తాను రెండు కాలనీల్లో పర్యటించి పరిస్ధితిని చూసి ఆశ్చర్యపోయామని వివరించారు. చాలామందికి బిల్లులు కాలేదని వీటిలో అనేక అవకతవకలు జరిగాయని తెలిపారు.ఇందులో దాదాపు రూ.100 కోట్ల వరకు అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈవ్యవహారంలో కొందరు ఎంపీడీవోలు, నేతలు, కార్యదర్శులు కుమ్ముకై ఉన్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అలాగే జిల్లాలో ఇసుక, సిలికా అక్రమ రవాణాను ఎవరూ అడ్డుకోలేకపోతున్నారని, జిల్లా కలెక్టర్‌ చొరవ చూపి జరిగిన అవినీతి బయట పెట్టి బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *