తోడు.. ఎవడు..?

evadu-thodu

ప్రియుడిని భర్తగా నమ్మించే యత్నం
మలుపు తిరిగిన రసాయన దాడి కేసు
భర్తను మాయం చేసిన భార్య

ఆసుపత్రిలో బయటపడ్డ బండారం

ప్రియుడిని.. భర్తగా నమ్మిచే ప్రయత్నం..

పోలీస్ విచారణలో… ఎవడు సినిమా.. సీన్ రివర్స్…

నాగర్‌కర్నూల్‌ జిల్లాకేంద్రంలో గత 27న జరిగిన రసాయన(యాసిడ్‌ కాదు) దాడి కేసు కీలక మలుపు తిరిగింది. ఓ మహిళ తన భర్త స్థానంలో మరోవ్యక్తిని చిత్రీకరించింది. అతనే భర్తగా నమ్మించడానికి పక్కా వ్యూహంతో దాడి చేయించింది. చివరికి కుటుంబ సభ్యులు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది మహిళ భర్త కాదని, మరోవ్యక్తి అని గుర్తించారు. మహిళ ఆడిన నాటకం సంచలనం రేపుతుండగా.. అసలు భర్తను తెలిసినవారితో కలిసి అంతమొందించిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. తెలకపల్లి మండలంలోని బండపల్లికి చెందిన స్వాతి, సుధాకర్‌రెడ్డి భార్యాభర్తలు. వీరు కొంతకాలంగా నాగర్‌కర్నూల్‌లో నివాసముంటున్నారు. గత 27న వీరు నివాసముంటున్న ఇంట్లో రసాయన దాడి జరిగింది. అనంతరం ఎవరికీ చెప్పకుండా దాడికి గురైన వ్యక్తిని స్వాతి చికిత్స కోసం హైదరాబాద్‌ ఆసుపత్రికి తరలించింది. గుర్తుతెలియని వ్యక్తులు తన భర్త సుధాకర్‌రెడ్డిపై యాసిడ్‌ దాడి చేశారంటూ స్వాతి ఫిర్యాదు చేసింది. హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలోని ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్న వ్యక్తి వద్దకు పోలీసులు వెళ్లి వివరాలను సేకరించారు. సుధాకర్‌రెడ్డి కుటుంబసభ్యులూ హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న వ్యక్తిని చూసి వచ్చారు. చికిత్స పొందుతున్నది సుధాకర్‌రెడ్డి కాదంటూ అతని అన్న సురేందర్‌రెడ్డి, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను నాగర్‌కర్నూల్‌లో నివాసముంటున్న రాజేశ్‌ అని పోలీసులు వేలిముద్రల ఆధారంగా గుర్తించారు. స్వాతి భర్త సుధాకర్‌రెడ్డి ఏమయ్యాడన్న కోణంలో పోలీసులు విచారణ జరిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలం ఫత్తేపూర్‌ శివారులోగల మైసమ్మ ఆలయ సమీపంలో స్వాతి భర్త సుధాకర్‌రెడ్డి హత్యకు గురైనట్లు అనుమానిస్తున్నారు. శనివారం నాగర్‌కర్నూల్‌కు చెందిన పోలీస్‌ అధికారులు హత్య జరిగినట్లు అనుమానిస్తున్న ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ ఓ వ్యక్తిని హత్య చేసి అనంతరం పెట్రోలు పోసి శవాన్ని కాల్చివేసినట్లు ఆనవాళ్లున్నట్లు సమాచారం. విషయం తెలుసుకొన్న సుధాకర్‌రెడ్డి కుటుంబసభ్యులు, ఆయన బంధువులు శనివారం నాగర్‌కర్నూల్‌లోని ఠాణాకు తరలివచ్చారు. 12 రోజులుగా చికిత్స పొందుతున్నది సుధాకర్‌రెడ్డి అన్న ఉద్దేశంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఇటీవలనే రూ.5 లక్షలు బిల్లును చెల్లించడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *