పాస్‌పోర్టు అందక..దుబాయ్‌ వెళ్లని క్రికెటర్లు

దుబాయ్‌: మరికొద్ది రోజుల్లో యూఏఈ వేదికగా ఆసియా కప్‌ టోర్నీ ప్రారంభంకానుంది. ఆరు జట్లు పాల్గొనే ఈ టోర్నీ ఈ నెల 15న ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో టోర్నీలో పాల్గొనే జట్లు అక్కడికి చేరుకుంటున్నాయి. సమయానికి పాస్‌పోర్టులు చేతికి అందకపోవడంతో ఇద్దరు క్రికెటర్లు యూఏఈ వెళ్లలేకపోయారు. ఇంతకీ ఆ ఇద్దరు క్రికెటర్లు ఎవరంటే… బంగ్లాదేశ్‌కు చెందిన తమీమ్‌ ఇక్బాల్‌, రుబెల్‌ హుస్సేన్‌.

షెడ్యూల్ ప్రకారం ఆదివారం రాత్రి 7.30గంటలకు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు దుబాయ్‌ వెళ్లే విమానం ఎక్కాలి. అనుకున్న సమయానికి అందరు ఆటగాళ్లు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. కానీ, ఇద్దరు మాత్రం రాలేదు. వారే తమీమ్‌ ఇక్బాల్‌, రుబెల్‌ హుస్సేన్‌. జట్టులో వీరిద్దరూ కీలకమైన ఆటగాళ్లు. ఇంతకీ వీరు రాకపోవడానికి కారణం ఏంటంటే పాస్‌పోర్టులు వారి చేతికి అందకపోవడం. ఆసియా కప్‌ టోర్నీ కోసం యూఏఈ వెళ్లేందుకు అనుమతి కోరుతూ వీరి పాస్‌ పోర్టులు స్టాంపింగ్‌ కోసం ఉన్నతాధికారుల వద్దకు వెళ్లాయి. కానీ, అక్కడ జాప్యం జరిగింది. అనుకున్న సమయానికి వీరి పాస్‌పోర్టులు చేతికి అందలేదు. దీంతో వీరు సహచర ఆటగాళ్లతో కలిసి దుబాయ్‌ వెళ్లలేకపోయారు.

వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించి, ఆటగాళ్లను దుబాయ్‌ పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు ప్రతినిధులు తెలిపారు. ‘టోర్నీ ప్రారంభానికి తక్కువ సమయం ఉంది. ఇక్బాల్‌, రుబెల్‌ వీలైనంత త్వరగా దుబాయ్‌ వేళ్లేందుకు చర్యలు తీసుకుంటాం’ అని వారు చెప్పారు. గ్రూప్‌-బిలో బంగ్లాదేశ్‌, శ్రీలంక, అఫ్గానిస్థాన్‌ ఉన్నాయి. టోర్నీలో తొలి మ్యాచ్‌ బంగ్లాదేశ్‌-శ్రీలంక మధ్యే(సెప్టెంబరు 15న) జరగనుంది. ఇదే టోర్నీలో భారత్‌ తన తొలి మ్యాచ్‌ను 18న హాంకాంగ్‌తో ఆడనుంది. ఆ తర్వాతి రోజే భారత్‌ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఢీకొట్టనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *