ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు శుభవార్త

Notification issued for DSC-2018

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డీఎస్సీ ద్వారా రాష్ట్రంలో భారీగా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ మేరకు సచివాలయంలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటనను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. డీఎస్సీ ద్వారా రాష్ట్రంలో మొత్తం 12,370 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. 2018 జూన్‌ 12 నాటికి ఉపాధ్యాయులకు పోస్టింగ్‌లు ఇవ్వాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. ఇందుకోసం డిసెంబర్‌ 26 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 2వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపారు.

గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు. మార్చి 23,24,26 తేదీల్లో జరిగే ఈ పరీక్షలకు అభ్యర్థులు సిద్ధం కావాలని ఆయన సూచించారు. హాల్‌ టిక్కెట్లును వచ్చే ఏడాది మార్చి 9 వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌, ఎస్జీటీ, లాంగ్వేజ్‌ పండింట్‌ ఉద్యోగాలు 10,313తో పాటు తొలి దశలో మోడల్‌ పాఠశాలల్లో 1197 ఉద్యోగాలు, ప్రత్యేక అవసరాలు కల్గిన విద్యార్థుల కోసం మరో 860 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

ముఖ్యమైన తేదీలివే..
* డీఎస్సీ నోటిఫికేషన్‌ – డిసెంబర్‌ 15న
* దరఖాస్తుల స్వీకరణ: డిసెంబర్‌ 26 నుంచి ఫిబ్రవరి 2 వరకు (ఆన్‌లైన్‌లో)
* హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు చివరి తేదీ: మార్చి 9
* రాత పరీక్షలు : మార్చి 23,24,26
* రాత పరీక్ష కీ విడుదల : ఏప్రిల్‌ 9న
* కీపై అభ్యంతరాల స్వీకరణ: ఏప్రిల్‌ 10 నుంచి 16 వరకు
* తుది కీ విడుదల తేదీ: ఏప్రిల్‌ 30
* మెరిట్‌ లిస్ట్‌ ప్రకటన : మే 5
* ప్రొవిజనల్‌ సెలక్షన్‌ విడుదల చేసి అభ్యర్థులకు సమాచారం: మే 11న
* ఎంపికైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన: మే 14 నుంచి 19 వరకు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *