బీజేపీలో ‘బడ్జెట్‌’ లుకలుకలు

'Budget' Loops in BJP

  • ఎంపీల్లో నిరుత్సాహం
  • పార్లమెంటరీ సమావేశంలో నిస్తేజం
  • భవిష్యత్‌ ఎన్నికలపై ఆందోళన

‘మనది ప్రజానుకూలమైన బడ్జెట్‌. మీరు నియోజకవర్గ స్థాయిలో ప్రజల్లోకెళ్లి.. ఈ చరిత్రాత్మక బడ్జెట్‌ గురించి వివరించండి..’ అంటూ.. గురువారం నాటి బడ్జెట్‌ తర్వాత పార్టీ పార్లమెంటరీ సమావేశంలో మోదీ చెబుతున్నప్పుడు.. చాలా మంది బీజేపీ ఎంపీలు నిస్తేజంగా చూశారని తెలిసింది. ‘సబ్‌ కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌’ అన్న తన నినాదానికి అనుగుణంగా బడ్జెట్‌ ఉందని మోదీ చెప్పినప్పుడు ఎంపీల్లో ఎలాంటి స్పందనా లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘సాధారణంగా.. ప్రతి మూడు నెలలకోసారి జరిగే పార్టీ పార్లమెంటరీ సమావేశాల్లో.. ప్రభుత్వం చేపడుతున్న మంచి పనులను వివరించాలని మోదీ అడుగుతుంటారు. దానికి ఎంపీలు స్పందిస్తుంటారు. కానీ.. గురువారం నాటి సమావేశంలో సభ్యుల్లో అంతగా ప్రతిస్పందన కనిపించలేదు’ అని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు చెప్పారు. మొత్తానికి ఈ బడ్జెట్‌ తర్వాత ఎంపీల్లో అయోమయం పెరిగిందని, ప్రజల్లోకి ఎలా వెళ్లాలో అర్థం కాక సతమతమవుతున్నారని తెలుస్తోంది. ‘అసలిప్పుడు ఎంపీలకు పార్లమెంట్‌కు వచ్చేందుకే ఆసక్తి లేదు.

ఇక బడ్జెట్‌ ఉత్సాహాన్ని ఎలా ప్రదర్శించగలరు? ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కూడా ఎన్ని వివరణలిచ్చినా.. ఎంపీలను మెప్పించలేకపోతున్నారు’ అని సీనియర్లు చెబుతున్నారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రోజే రాజస్థాన్‌లో మూడు సిట్టింగ్‌ స్థానాల్లో బీజేపీ ఓడిపోవడం.. తమకు అన్యాయం జరిగిందంటూ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలు నిరసన వ్యక్తం చేయడం.. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి తప్పుకోనుందనే ప్రచారం గుప్పుమనడం.. ఇప్పుడు బీజేపీలో చర్చనీయాంశమైంది. గుజరాత్‌ ఎన్నికలతోనే కేంద్రంలో బీజేపీ సర్కారు పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరగడం ప్రారంభమైందని, రాజస్థాన్‌ ఎన్నికల్లో అది వ్యక్తమైందని ఒక సీనియర్‌ నేత అన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో పార్టీని బలోపేతం చేసేందుకు ఏ మాత్రం ప్రయత్నాలు జరగడం లేదని.. మోదీ గ్రాఫ్‌ పడిపోతున్న తరుణంలో బీజేపీతో చేతులు కలిపేందుకు ఏ పార్టీ కూడా ఇష్టపడదని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. దక్షిణాది పార్టీలు ఏవీ బీజేపీని దగ్గరకు రానిచ్చే అవకాశం లేదని, ఉత్తరాదిన ఇప్పుడున్న సీట్లు బాగా తగ్గిపోతాయే కానీ.. పెరిగే అవకాశం లేదని అంటున్నాయి.

కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందనే ఆత్మవిశ్వాసాన్ని పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా వ్యక్తం చేసినా..వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. కాగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో బీజేపీ నేతలతో గురువారం రాత్రి పొద్దుపోయే దాకా సమావేశమైన అమిత్‌ షాలో అంతగా ఉత్సాహం కనిపించలేదని తెలిసింది. ‘ఏదో మొక్కుబడిగా ప్రశ్నలు వేసి.. పంపించారే తప్ప.. నేతల్లో ఉత్సాహం కలిగించేలా మాట్లాడలేదు. మమ్మల్ని కాలక్షేపానికి పిలిచినట్లుంది’ అని ఏపీకి చెందిన నేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నుంచి వచ్చిన తర్వాత అమిత్‌ షా అలిసిపోయి కనిపించారని ఆయన చెప్పారు. ఇక శుక్రవారం అమిత్‌ షా, ప్రఽధాని నరేంద్రమోదీ, హోంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌లు పార్టీ వ్యూహకర్తలతో చర్చలు జరిపారు.