బాలీవుడ్‌ నటుడు శశికపూర్‌ కన్నుమూత

Bollywood actor Shashi Kapoor passes away

ముంబయి: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, నిర్మాత శశికపూర్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. నటుడిగా, నిర్మాత, దర్శకుడిగా సినీ రంగంలో శశికపూర్‌ తనదైన ముద్రవేశారు. బాలీవుడ్‌కు చెందిన కపూర్‌ల కుటుంబంలో శశికపూర్‌ సభ్యుడు. ఆయన 1938 మార్చి 18న కలకత్తా(కోల్‌కతా)లో జన్మించారు. పృథ్వీరాజ్‌కపూర్‌ మూడో కుమారుడు శశికపూర్‌. రాజ్‌కపూర్‌, షమ్మీ కపూర్‌లకు సోదరుడు. బ్రిటన్‌కు చెందిన జెన్నిఫర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం, కరణ్‌ కపూర్‌, కునాల్‌ కపూర్‌, సంజనా కపూర్‌లు. చిత్ర పరిశ్రమకు శశికపూర్‌ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మ భూషణ్‌ అవార్డుతో సత్కరించింది. ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును కూడా శశికపూర్‌ అందుకున్నారు.
శశికపూర్‌ నాలుగేళ్ల వయసు నుంచే నట జీవితాన్ని ప్రారంభించారు. ఆయన తండ్రి స్థాపించిన పృథ్వీ థియేటర్స్‌తో పాటు ఆయన నిర్మించి, దర్శకత్వం వహించిన నాటకాలలో వివిధ పాత్రలు పోషించే వారు. బాల నటుడిగా సంగ్రామ్‌(1950), దనపాణి(1953) వంటి కమర్షియల్‌ చిత్రాల్లో నటించారు. 1948లో వచ్చిన ‘ఆగ్‌’, 1951లో వచ్చిన ‘ఆవారా’ చిత్రాల్లో తన అన్న రాజ్‌కపూర్‌ చిన్నప్పటి పాత్రను పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. ‘ధర్మపుత్ర’ చిత్రం ద్వారా నటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. శశికపూర్‌ తన సినీ కెరీర్‌లో మొత్తం 148 హిందీ సినిమాల్లోను, 12 ఇంగ్లిష్‌ సినిమాల్లోనూ నటించారు. కథానాయకుడిగా 61 సినిమాల్లో నటించారు. అంతేకాదు లీడ్‌ హీరోగా 53 మల్టీస్టారర్‌ చిత్రాల్లో నటించడం విశేషం. ఇక 21 సినిమాల్లో సహాయ పాత్రలు, 7 సినిమాల్లో అతిథి పాత్రలు పోషించారు. కేవలం హిందీ సినిమాల్లోనే కాదు.. పలు ఇంగ్లిష్‌ చిత్రాల్లోనూ నటించారు.

* కథానాయకుడిగా కెరీర్‌ ప్రారంభించిన తొలినాళ్లలోనే శశికపూర్‌కు ఎదురు దెబ్బలు తగిలాయి. ఒకటి రెండు సినిమాలతో ఫ్లాప్‌ హీరో అనే ముద్ర పడింది. ఆ సమయంలోనే హీరోయిన్‌ నందా కలిసి చేసిన ‘జబ్‌ జబ్‌ ఫూల్‌ ఖిలే’ భారీ విజయాన్ని అందుకుంది. మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది. అక్కడి నుంచి శశికపూర్‌ వెనుతిరిగి చూసుకోలేదు. ‘నీంద్‌ హమారీ, ఖ్యాబీ తుమ్హారీ’, ‘మొహబ్బత్‌ ఇస్కో కహాతే హై’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నందాతో కలిసి నటించారు.
* శశికపూర్‌ జీనత్‌ అమన్‌ కలిసి పది సినిమాల్లో నటిస్తే ఆరు సినిమాలు బ్లాక్‌ బస్టర్‌ హిట్‌. ఇక రాఖీతో కలిసి నటించిన పదింటిలో ఏడు బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించాయి.
* రాజేశ్‌ఖన్నా-శశికపూర్‌ల మధ్య తీవ్ర పోటీ ఉండేది. రాజేశ్‌ ఖన్నా వద్దంటే దర్శక-నిర్మాతలకు శశికపూర్‌ సెకండ్‌ ఆప్షన్‌ అన్న స్థాయిలో ట్రెండ్‌ నడిచింది.
* 1974-77 మధ్య శశికపూర్‌ నటించిన సినిమాల్లో దాదాపు పదికి పైగా సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. అప్పటి నుంచి ఆయన మెల్లగా మల్టీస్టారర్‌ సినిమాలు చేయటం ప్రారంభించారు. కథానాయకుడిగా 61 సినిమాలు చేస్తే 33 విజయాలు లభించాయి.. అదే మల్టీస్టారర్‌గా 54 సినిమాలు చేస్తే 34 హిట్‌లు.. సూపర్‌హిట్‌లు..
* కేవలం నటుడిగానే కాకుండా నిర్మాత, సహాయ దర్శకుడిగా, దర్శకుడిగా అన్ని రంగాల్లో తనదైన ముద్రవేశారు.
* అమితాబ్‌ బచ్చన్‌కు సోదరుడి పాత్రలో శశికపూర్‌ ఎక్కువ చిత్రాల్లో నటించారు. ‘దివార్‌’, ‘సుహాగ్‌’, ‘దో ఔర్‌ దో పాంచ్‌’, ‘నమక్‌ హలాల్‌’ వంటి సిల్వర్‌ జూబ్లీ సినిమాల్లో శశికపూర్‌ తనదైన నటన కనబరిచారు. ఆ సినిమాల్లో అమితాబ్‌తో సమానమైన పేరును తెచ్చుకున్నారు. అయితే 1981లో వచ్చిన ‘సిల్‌సిలా’ చిత్రంలో మాత్రం శశికపూర్‌కు తమ్ముడిగా అమితాబ్‌ నటించడం విశేషం.
* ‘దీవార్‌’లో ‘తుమ్హారే పాస్‌ క్యా హై’ అని అమితాబ్‌ వేసిన ప్రశ్నకు‘మేరే పాస్‌ మా హై’ అని శశికపూర్‌ చెప్పిన చిన్న డైలాగ్‌ దేశ వ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించింది.
* తండ్రి స్థాపించిన ‘పృథ్వీ థియేటర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌గా, నటుడిగా పనిచేస్తున్న రోజుల్లో జెన్నిఫర్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. జెన్నిఫర్‌ తండ్రికి ఇష్టం లేకపోయినా 1958లో ఇరువురు ఒక్కటయ్యారు.
* తాను నటించే ప్రతీ పాత్ర ఎంతో విభిన్నం చేయాలని తపన పడేవారు శశికపూర్‌లో ‘అభినేత్రి’లో ఆయన పాత్రను ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు.
* నటుడిగా తన కెరీర్‌ను కొనసాగిస్తూనే శ్యామ్‌బెనగల్‌తో కలిసి కలియుగ్‌, జునూన్‌ చిత్రాలు, అపర్ణాసేన్‌తో కలిసి ‘36 చౌరంఘీలేన్‌’ సినిమాలను నిర్మించారు. గిరీష్‌ కర్నాడ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఉత్సవ్‌’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
* కేవలం జాతీయ నటుడిగానే కాకుండా అంతర్జాతీయ నటుడిగానూ శశికపూర్‌ పేరు గడించారు. మొత్తం 12 హాలీవుడ్‌ చిత్రాల్లో ఆయన నటించారు. 1998లో ఆయన నటించిన చివరి చిత్రం, హాలీవుడ్‌ చిత్రం ‘సైడ్‌ స్ట్రీట్స్‌’.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *