బిట్‌కాయిన్‌.. పరుగే పరుగు.. ఒక్కరోజే రూ. 3 లక్షలు పైకి…

bitcoin

బిట్‌కాయిన్‌.. పరుగే పరుగు
1 = 10,00,000
రూపాయిల్లో ఒక బిట్‌ కాయిన్‌ విలువ ఇది
ఏడాదిలో 1500% పైగా దూకుడు
ఒక్కరోజే రూ. 3 లక్షలు పైకి
ఫ్యూచర్స్‌ విభాగంలోకి తెస్తున్న నాస్‌డాక్‌, షికాగో ఎక్స్ఛేంజీలు
జోరుకు ఇదీ ఓ కారణమే
దూరంగా ఉండటమే మేలని ఆర్‌బీఐ హెచ్చరిక

అదేమి చిత్రమోకాని ఓ కరెన్సీ వచ్చి పడింది.. అది ఏ ఒక్క దేశానికో చెందింది కాదు.. ఏ సెంట్రల్‌ బ్యాంకూ నియంత్రించదు. కఠిన విధానాల వూసే వినిపించదు.. ఎక్కువమంది వాడనే వాడరు.. అంతకుమించి భౌతిక రూపమే లేదు.. అయినా.. రయ్‌రయ్‌మంటూ పరిగెడుతోంది.. విలువపరంగా ప్రపంచదేశాల కరెన్సీలకు అందనంత దూరంలో ఉంది. మరి ఇది వాపో..బలుపో.. లేదంటే వైష్ణవ మాయో… దాని కథాకమామీషు ఏమిటో చూద్దామా…

బిట్‌ కాయిన్‌.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్న పదం ఇది. ఈ పదంలోనే కాయిన్‌ ఉంది కదా అని.. మన రూపాయి నాణెం లాంటిదని అనుకుంటే పొరపాటే. ఇదేమీ కంటికి కనిపించదు. డిజిటల్‌ (క్రిప్టో) కరెన్సీగా దీన్ని వ్యవహరిస్తారు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి.. ఆన్‌లైన్‌లో మాత్రమే బదిలీ చేయడానికి, విక్రయించడానికి వీలున్న కరెన్సీ అన్నమాట. దీని ద్వారా వస్తువుల క్రయవిక్రయాలు నిర్వహించాలంటే కూడా ఆన్‌లైన్‌లోనే చేయాలి. ఇందుకు ప్రత్యేక వ్యాలెట్లు ఉంటాయి. బిట్‌కాయిన్‌పై సెంట్రల్‌ బ్యాంకుల నియంత్రణ ఉండదు. ఒక స్వతంత్ర వ్యవస్థ ఆధారంగా బలమైన కంప్యూటర్లు, సర్వర్ల సాయంతో దీని లావాదేవీలు జరుగుతుంటాయి.

సృష్టికర్త.. ఓ అజ్ఞాతవాసి
జపాన్‌కు చెందిన సతోషి నకమొతో ఈ బిట్‌కాయిన్‌ సృష్టికర్త. 2008లో కాగితం రూపంలో దీన్ని తీసుకొచ్చారని చెబుతుంటారు. అనంతరం డిజిటల్‌ రూపంలో వ్యక్తుల నుంచి వ్యక్తులకు మార్చుకునే కరెన్సీగా ఇది రూపాంతరం చెందింది. అయితే సతోషి ఎవరనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. బిట్‌కాయిన్‌ను ఓ ఇంజినీర్ల బృందం రూపొందించిందని చెప్పేవాళ్లూ లేకపోలేదు. ఈ విషయంపైనా కచ్చితమైన నిర్ధారణ లేదు.

తవ్వి తీస్తారా.. !
కొత్త బిట్‌కాయిన్ల సృష్టి జరగడాన్ని మైనింగ్‌ (తవ్వడం) అంటారు. అదెలాగో చూద్దాం. ఇప్పుడు ఓ వ్యక్తి తన వ్యాలెట్‌ నుంచి మరో వ్యక్తి వ్యాలెట్‌కు బిట్‌కాయిన్‌లు పంపాడనుకుందాం. అవతలి వ్యక్తి వ్యాలెట్‌లోకి ఇవి వెంటనే వెళ్లవు. ఓ బ్లాక్‌గా మారుతాయి. ఇలాంటి కొన్ని బ్లాకులన్నీ కలిసి బ్లాక్‌ చెయిన్‌గా ఏర్పడి ఓ అల్గారిథమ్‌ ఈక్వేషన్‌గా రూపొందుతాయి. దీనిని పరిష్కరిస్తేనే (సాల్వ్‌) అవతలి వ్యక్తి వ్యాలెట్‌కు బిట్‌కాయిన్‌లు బదిలీ అవుతాయి. ఈ ఈక్వేషన్లను పరిష్కరించేందుకు ఓ బృందం పనిచేస్తుంది. వీరిని మైనర్లు అంటారు. వీళ్లు ఆ ఈక్వేషన్‌ను వ్యాలిడేట్‌ చేయడం వల్ల కొత్త బిట్‌కాయిన్‌ల సృష్టి జరుగుతుంది. ఇవి రివార్డు కింద మైనర్లకే లభిస్తాయి. ఎందుకంటే ఈక్వేషన్ల పరిష్కారం నిమిత్తం వీళ్లు శక్తిమంతమైన సర్వర్లు వాడుతుంటారు. ఇందుకు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. దానికి ప్రతిఫలంగా వీటిని పొందుతారు.

అమాంతం ఇందుకేనా..: ఈ ఏడాది ప్రారంభంలో రూ.50,000- 65000 (800- 1000 డాలర్లు) మధ్య ఉన్న బిట్‌కాయిన్‌ ప్రస్తుతం రూ.పది లక్షల (16000 డాలర్లు.. ఒక దశలో 17000 డాలర్ల పైకి వెళ్లి వచ్చింది) వరకు పలుకుతోంది అంటే ఏడాదిలో ఇప్పటివరకు 1500 శాతం పైనే పెరిగిందన్నమాట. గురువారం ఒక్కరోజే దాదాపు 5000 డాలర్లు(రూ. 3 లక్షల పై మాటే)దాకా పెరగడం గమనార్హం. ఇందుకు ప్రధాన కారణాలు.
* షికాగో మర్కంటైల్‌ ఎక్స్ఛేంజీ (సీఎంఈ) గ్రూపు, నాస్‌డాక్‌ బిట్‌కాయిన్‌కు ఫ్యూచర్‌ ట్రేడింగ్‌ను ప్రారంభిస్తామని ప్రకటించడం.
* హెడ్జ్‌ ఫండ్స్‌, అసెట్‌ మేనేజర్స్‌ లాంటి సంప్రదాయ మదుపర్ల నుంచి ఆదరణ పెరుగుతుండటం.
* రాన్‌సమ్‌ వేర్‌ వైరస్‌ దాడి సమయంలో హ్యాకర్లు చెల్లింపులను బిట్‌ కాయిన్‌ రూపంలోనే చేయాలని అడగడం.
* బిట్‌కాయిన్‌ ద్వారా చెల్లింపులకు వీలు కల్పిస్తున్న ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ విక్రయ కేంద్రాల సంఖ్య పెరుగుతుండటం.

వ్యాలెట్‌ ఉంటేనే..
బిట్‌ కాయిన్‌ కొనేందుకు ముందుగా వ్యాలెట్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వ్యక్తుల నుంచి లేదా ఎక్స్ఛేంజీల ద్వారా బిట్‌కాయిన్‌లను కొనుగోలు చేయొచ్చు. ఇందుకు బిట్‌ స్టాంప్‌ (అమెరికా), ఓకే కాయిన్‌ (చైనా) సహా ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు, ఎక్స్ఛేంజీలు ఉన్నాయి. మన దేశంలో జేబ్‌పే, ఉనోకాయిన్‌, కాయిన్‌ సెక్యూర్‌ వంటి సంస్థలు బిట్‌కాయిన్‌ క్రయవిక్రయాలకు వీలు కల్పిస్తున్నాయి. అయితే భారత్‌లో మొబైల్‌ బిట్‌కాయిన్‌ వ్యాలెట్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన మొట్టమొదటి బిట్‌కాయిన్‌ కంపెనీ జేబ్‌పే. దీని ద్వారా మొబైల్‌ నంబరు ఆధారంగా బిట్‌కాయిన్‌ లావాదేవీలు నిర్వహించవచ్చు.

హ్యాకర్ల మొగ్గు ఇటువైపే..
అండర్‌ గ్రౌండు కార్యకలాపాలు నిర్వహించేవారు, హ్యాకర్లు ఎక్కువగా బిట్‌ కాయిన్‌ ద్వారా క్రయవిక్రయ లావాదేవీలు జరుపుతుంటారు. బిట్‌కాయిన్‌పై ప్రభుత్వాలు, సెంట్రల్‌ బ్యాంకుల నియంత్రణ లేకపోవడం.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికైనా వీటిని పంపే వెసులుబాటు ఉండటం.. ఎవరి నుంచి ఎవరికి వెళ్లాయనే వివరాలు బయటకు తెలిసే అవకాశం లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు.

లేకున్నా అమ్మొచ్చు..
బిట్‌కాయిన్‌ను త్వరలోనే షార్ట్‌ సెల్‌ చేసే అవకాశం రానుంది. అంటే మన దగ్గర లేకపోయినా అప్పుగా తీసుకొని అమ్మేయొచ్చు అన్నమాట. బిట్‌కాయిన్‌లో ఫ్యూచర్స్‌ కాంట్రాక్టులను ప్రవేశపెట్టేందుకు షికాగో మర్కంటైల్‌ ఎక్స్ఛేంజీ (సీఎంఈ) సిద్ధమవుతోంది. ఈ గ్రూపునకు చెందిన సీబీఓఈ ఫ్యూచర్స్‌ ఎక్స్ఛేంజీలో డిసెంబరు 18న బిట్‌ కాయిన్‌ ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభం అవుతోంది. అమెరికాలో ప్రముఖ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నాస్‌డాక్‌ కూడా ఈ దిశగాఅడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రాచుర్యం ఎంతో.. విమర్శలూ అంతే
ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గంగా బిట్‌కాయిన్‌ స్వల్ప కాలంలోనే ప్రాచుర్యం పొందింది. దీని తర్వాత చాలానే డిజిటల్‌ కరెన్సీలు వచ్చాయి. అయితే ఈ స్థాయిలో రాణించింది మరొకటి లేదనే చెప్పాలి. మరోవైపు బిట్‌కాయిన్‌పై అదే స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. అసామాన్య స్థాయిలో ఇది పెరగడంపై చైనా, దక్షిణ కొరియా లాంటి దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇదో గాలి బుడగని, ఎప్పుడోకప్పుడు పగులుతుందని కొందరు విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఇవన్నీ ఒక వైపైతే వచ్చే 6 నుంచి 18 నెలల్లో దీని విలువ 50,000 డాలర్లకు చేరే అవకాశం ఉందని విశ్వసించే వాళ్లూ లేకపోలేదు.

 

పారాహుషార్‌..
నతికాలంలోనే ఆకర్షణీయ ప్రతిఫలాన్ని పంచింది కదా అని బిట్‌కాయిన్‌ కొనుగోళ్లకు వెంటనే మొగ్గుచూపడం అంత శ్రేయస్కరం కాదు. ముఖ్యంగా స్వల్పకాలంలో లాభాలు ఆర్జించేయాలనే వూహలో ఉండేవారు ఇలాంటి వాటిలోకి తక్షణం దిగిపోతారు. మనకూ లాభాలొచ్చేస్తాయని అత్యాశకు పోయి అప్పులు చేసి మరి పెట్టుబడులు పెట్టేస్తుంటారు. అయితే ఎంత వేగంగా పెరిగిందో.. అంతే వేగంగా కిందకు వచ్చే అవకాశమూ ఉంటుందనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఇదే జరిగితే పెట్టిన పెట్టుబడి క్షణాల్లో హారతి కర్పూరం అయిపోతుంది. అప్పుల వూబిలో చిక్కుకోవాల్సి వస్తుంది. కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఏ స్థాయిలో పెరిగినప్పటికీ.. ఎంత లాభాలు పంచినప్పటికీ.. సగటు ఆర్థిక స్థోమత కలిగిన వ్యక్తులు ఇటువంటి వాటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటమే మంచిది. ఇప్పటికే ఆర్‌బీఐ కూడా ఇలాంటి జాగ్రత్తలే చెప్పింది.
2.1 కోట్లు
బిట్‌ కాయిన్ల సంఖ్య 2.1 కోట్లకే పరిమితం. ఈ స్థాయికి చేరాక కొత్తవి సృష్టించడం ఆగిపోతుంది. అయితే దీనిని విభజించే వీలుంది. ప్రస్తుతం చలామణిలో ఉన్న బిట్‌ కాయిన్ల సంఖ్య సుమారు 1.6 కోట్లుగా చెబుతున్నారు.
10 కోట్ల సతోషిలు
ప్రస్తుతం బిట్‌కాయిన్‌ను 10 కోట్లవ వంతుకు విడగొడుతున్నారు. ఇలా విడగొట్టిన విలువకు బిట్‌కాయిన్‌ సృష్టికర్త సతోషి నకమోతో పేరుతోనే ‘సతోషి’ అని నామకరణం చేశారు. అంటే 10 కోట్ల సతోషిలు ఒక్క బిట్‌కాయిన్‌కు సమానమన్నమాట.
నెం.1
గూగుల్‌ సెర్చ్‌ ట్రెండ్స్‌ ప్రకారం గత 12 నెలల్లో గూగుల్‌లో భారతీయలు అన్వేషించిన పెట్టుబడి మార్గాల జాబితాలో బిట్‌కాయిన్‌దే అగ్రస్థానం.
10 లక్షల రెట్లు
2009లో బిట్‌కాయిన్‌ విలువ అమెరికా సెంటు విలువ కంటే కూడా తక్కువ. 2011లో ఇది డాలరు స్థాయికి చేరింది. 2011తో పోలిస్తే 10,000 రెట్లు పెరగగా.. 2009తో చూస్తే 10 లక్షల రెట్లు వృద్ధి చెందింది.
రూ. 12,00,000 కోట్లు
ప్రస్తుతం వ్యవస్థలోకి వచ్చిన బిట్‌ కాయిన్‌ల మొత్తం విలువ 19000 కోట్ల డాలర్లని అంచనా. మన కరెన్సీలో ఇది రూ.12,00,000 కోట్లు. పెద్ద నోట్ల రద్దుకు ముందు చలామణిలో ఉన్న పాత రూ.500, రూ.1000 నోట్ల మొత్తం విలువ రూ.15,44,000 కోట్ల కంటే ఇది రూ.3,44,000 కోట్లు తక్కువ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *