తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న భారత్‌ బంద్‌ ……

bharat-bandh-today

విజయవాడ : పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్‌ బంద్‌లో వామపక్షాలు, కాంగ్రెస్‌, జనసేన పార్టీలు పాల్గొన్నాయి. ధరలను నిరసిస్తూ విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట ఆందోళన చేపట్టాయి. అక్కడ ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు.

కరీంనగర్ : పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు బస్టాండ్ వద్ద బైఠాయించారు. బస్టాండ్‌ నుంచి బస్సులను బయటకు రానివ్వకుండా వారు అడ్డుకున్నారు. ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్ కృష్ణన్, టీపీసీసీ ఉపాధ్యక్షులు పొన్నం ప్రభాకర్, డీసీపీ అధ్యక్షులు మృత్యుంజయంతో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.

అనంతపురం : పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు నిరసనగా కాంగ్రెస్, జనసేన, వామపక్షాలు నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా ఆందోళన కారులు ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు.

నల్గొండ :  పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ చేపట్టిన భారత్ బంద్‌లో వామపక్షాలు పాల్గొన్నాయి. బంద్‌లో భాగంగా నల్గొండ బస్ డిపోలో వామపక్షాల నాయకులు బైఠాయించారు.  బైఠాయింపుతో రాకపోకలు నిలిచిపోయి ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి.

చిత్తూరు : జిల్లాలో బంద్‌ కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో భారత్ బంద్ సందర్భంగా సీపీఐ,సీపీఎమ్‌, జనసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బంద్‌ కారణంగా బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. పెట్రోల్ డీజల్ ధరల పెంపును నిరసిస్తూ మదనపల్లిలో వామపక్షాలు, జనసేన ,కాంగ్రెస్‌ పార్టీల ఆధ్వర్యంలో బంద్‌ కొనసాగుతోంది. బంద్‌కు మద్దతుగా పలు ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించాయి.

గుంటూరు : పెట్రోలు, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్, జనసేన, వామపక్షాలు బంద్ చేపట్టాయి. గుంటూరు, వినుకొండ, నరసరావుపేట, రేపల్లె, సత్తెనపల్లి బస్టాండ్ వద్ద ఆందోళనకారులు బైఠాయించారు. వారు ఆర్టీసీ బస్సులు బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కృష్ణాజిల్లా : పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా చేపట్టిన దేశవ్యాప్త బంద్ కొనసాగుతోంది. తిరువూరులో బస్సులను అడ్డుకున్న కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కార్యకర్తలు, నాయకులు 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులను పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆర్టీసీ అధికారులు బస్సులను తిప్పుతున్నారు.

Source by  SAKSHI

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *